Tuesday, September 8, 2015

ఇళ్లలో హెర్బల్ మొక్కల పెంపకం /ఇంటిలో ఔషధ మొక్కల పెంపకం

ఇంటిని ఔషధ మొక్కలతో పచ్చదానాల పొదరిల్లుగా మార్చుకోవటం ఏమంత కష్టం కాదు అని అంటున్నారు హెర్బల్ వైద్య నిపుణులు. మనరోజువారీ పనుల్లోనే హెర్బల్ మొక్కల పెంపకం కూడా ఒకటి అని భావిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్ ఇళ్లలో ఇది సాధ్యమా అని అనుకోవద్దు. బాల్కనీ, కారిడార్ ఇలా కాస్తంత స్థలం ఉంటే చాలు ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మనఇంటిలో అనారోగ్య సమస్యలు మనదరి చేరవు తెలుసుకుందాం.


అది అపార్ట్‌మెంట్ కావచ్చు, లేదా విశాలమైన స్థలమున్న పల్లెటూరిలోని పెంకుటిల్లు కావచ్చు. ఏదైనప్పటికీ ఔషధ మొక్కలను పెంచాలనే ఆసక్తి ఉంటే చాలు ఎన్నోరకాలు మనముంగిట ఉన్నాయి. మనకున్న స్థలంలోనే చిన్నపాటి హెర్బల్ గార్డెన్ (మూలికా వనాన్ని)ని పెంచుకోవటం పెద్దకష్టమైన పని కాదు. 

యాభై ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటిలోనూ, నిర్మానుష్య ప్రాంతాల్లో బిల్వచెట్టు ఉండేది. పరమశివుడికి ప్రీతికరమైన బిల్వచెట్టును ఔషధ మొక్కగా మెడిసినల్ ప్లాంట్ బోర్డ్సు (ఎస్‌ఎంపిబి) సైతం ఆమొదించింది. కాని నేడు ఇది పల్లెల్లో సైతం కనుమరుగైంది. పట్టణాల్లో గజం స్థలం బంగారం కన్నా మిన్నగా మారుతున్న నేటి పరిస్థితులలో ఇలాంటి చెట్లు పెంచితే ఆరోగ్యం మాట ఎలా ఉన్నా కాసులు రావు.
 కాని గ్రామీణ ప్రాంతాల్లో సైతం నేడు ఎక్కడా బిల్వ వృక్షమే కానరావటం లేదు. అలాగే ఎక్కడపడితే అక్కడ పెరిగే తజుతామా(శాస్ర్తియ నామం) అనే మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. వీటి ఆకులను కూర వండుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. డైట్ పరంగా ఈ ఆకులతో చేసిన వంటకాలు ఎంతో మేలు. ఇలాంటి మొక్కను సైతం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అని పెద్దలు అన్న మాటలో ఎంతో వాస్తవం దాగి ఉంది. మహిళలు ఎక్కువగా వినియోగించే ఈ ఆముదం వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతోంది.
.
ఔషధ మొక్కలు పెంచాలంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఇల్లే అనుకూలం అని అనుకుంటే పొరపాటు. అక్కడ విశాలమైన స్థలం ఉంటుంది కాబట్టి పెంచవచ్చనే అపొహ ఉంది. మనసుంటే మార్గం ఉండకపోదు. చిన్న ప్లాట్‌లో ఉండే గృహిణి సైతం ఔషధ మొక్కలను పెంచవచ్చని, తద్వారా ఆదాయాన్ని పొందవచ్చని హెర్బల్ మందులపై పుస్తకాన్ని రాసిన రచయిత్రి పి.ఉషా తెలియజేస్తున్నారు. కేరళలో గ్రామీణ ఆరోగ్య కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఈమె ఔషధ మొక్కలు పెంచటానికి ఆసక్తి చూపేవారికి విత్తనాలు, మొక్కలు సరఫరా చేస్తోంది. ఈ ట్రెండ్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాకుండా పట్టణాలకు కూడా విస్తరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తులసి మొక్క ప్రతి ఇంట ఉంటే ఆ ఇంటిలోఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. సాధారణమైన వెలుతురు, వేడి, చలి ఉంటే చాలు తులసి ఏపుగా పెరుగుతోంది. తులసి ఉన్న చోట దోమలు రావు. అంతేకాదు ఓజోన్‌ను గాలిలో పరిరక్షించే శక్తిప్రధాయిని. మన బెడ్‌రూమ్ కిటికీ చెంతనో లేదా ఇంటి ఎదురుగానో తులసిని పెంచుకుంటే ఆ ఇంటిలో స్వచ్ఛమైన గాలి వస్తోంది. బిల్వ, వేప చెట్లు ఉన్న ఇంటిలో కూడా స్వచ్ఛమైన గాలి వస్తోంది. వేప చెట్టుకింద నిద్రిస్తే శ్వాసకోశ ఇబ్బందులు తొలగిపోతాయని వైద్య నిపుణులే సలహా ఇస్తున్నారు. అయితే ఇలాంటి పెద్ద చెట్లు పెంచుకునే స్థలం పట్టణప్రాంతవాసులకు కుదరదు కాబట్టి అపార్ట్‌మెంట్ చుట్టూ ఉండే స్థలంలో ఇలాంటి చెట్లు పెంచే ట్రెండ్‌ను నెలకొల్పాల్సి ఉంది.
అపార్ట్‌మెంట్ ఇళ్లల్లో పెంచే మొక్కలు
అపార్ట్‌మెంట్ ఇళ్లలో సైతం ఔషధ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది. కలబందను చిన్న చిన్న కుండీలలోనూ, సంచుల్లోనూ పెంచుకోవచ్చు. కలబంద ఇంటిలో పెంచుకుంటే వేసవి కాలంలో ఆ ఇల్లు ఎంతో చల్లగా ఉంటుంది. కంటి సమస్యలను, తలనొప్పి తదితర సమస్యలను దూరం చేస్తోంది. ఇంకా పసుపు, మలబార్, అల్లం, కైయున్నాం, లెమన్‌గ్రాస్, బ్రాహ్మీ, మునగ తదితరవాటిని పెంచుకోవటానికి తక్కువ స్థలం చాలు. ఈ మొక్కలు ఇళ్లలో ఉంటే శ్వాసకోశ, వత్తిడి తదితర సమస్యల నుంచి బయటపడేస్తాయి. మునగ ఆకు మల్టీవిటమిన్‌గా ఉపకరిస్తోంది. పసుపు, అల్లం ఆకులు ఔషధాల తయారీకి ఎంతో ఉపకరిస్తాయి.
మనం నివసించే చిన్న ఇంటిలోనే మొక్కలను పెంచాలనే ఆసక్తి ఉంటే ఔషధ మొక్కలను ఎంపికచేసుకుంటే పచ్చదనంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరలు ఎన్నింటినో చిన్న చిన్న సంచులలో పెంచుకునే వీలుంది. ఈ ఆకుకూరలు పెంచటం వల్ల ఇంటికి అవసరమైన కూరలు సమృద్ధిగా వస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి. ఆసక్తి కనబరిచే ఔత్సాహికులు కార్యరంగంలోకి దిగి మీ ఇంటిని పచ్చదనాల ఔషధ మొక్కల పొదరిల్లుగా మార్చుకోవటం మీ చేతుల్లోనే ఉంది.

No comments:

Post a Comment