Tuesday, September 8, 2015

క్యారెట్, బీట్‌రూట్ చెట్లు ఎందులో పెంచాలి..!!

మొక్కలు పెంచడం ఒక కళ. కొంత సమయాన్ని, మరికొంత పరిశ్రమనుజోడిస్తే ఆ కళలో నైపుణ్యాన్ని సాధించవచ్చు. ఇంటి ఆవరణలో చక్కటి తోటను పెంచవచ్చు. గార్డెన్‌ను చక్కగా మెయింటెయిన్ చేస్తే ఇల్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. తాజా గాలిని, పూల పరిమళాన్ని ఆస్వాదించవచ్చు.

రోజంతా ఎన్ని ఒత్తిడులకు లోనయినా అరగంట సమయం మొక్కల మధ్య తిరిగితే టెన్షన్ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో పెరిగిన కూరగాయలతో తాజాగా, రుచికరమైన భోజనం కూడా చేయవచ్చు.

* ఇంటి ఆవరణలో ఏడాదిలో ఏ కాలంలోనైనా సూర్యరశ్మి, గాలి వెలుతురు ప్రసరించే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. గింజలు లేదా మొక్కలను సిద్ధం చేసుకోవాలి. నర్సరీ నుంచి మొక్కలను కొనడం కంటే మనమే గింజలు చల్లి నారు పెంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. గింజలు చల్లాల్సిన సీజన్‌లో సాధ్యం కాకపోయినా, చల్లిన గింజలు సరిగా మొలవక పోతే అప్పుడు నేరుగా మొక్కలను తెచ్చుకోవచ్చు.

* మొక్కను నాటే ముందు చెట్టు వేర్లు భూమిలోకి చొచ్చుకుపోవడానికి వీలుగా, రాళ్లను తొలగించి మట్టిని గుల్లబరిచి, నేలను చదును చేయాలి. పై పొరలో ఆకులు, గడ్డి నింపాలి. ఇది నీరు ఎక్కువ - తక్కువల ప్రభావం మొక్కల మీద పడకుండా నిరోధిస్తుంది. ఈ పొర భూమిలోని అదనపు తేమను పీల్చుకుంటుంది. అలాగే నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది.

* గింజలు చల్లిన నేలను నీటితో నింపకుండా, ప్రతిరోజూ కాస్త నీటిని చిలకరించినట్లు చల్లాలి. మొక్కల మొదళ్లకు మాత్రం నీటిని సరిపెట్టకుండా ఆకుల మీద కూడా చల్లాలి. అలాగే ఎండుటాకులు, మొక్కలకు హాని కలిగించే పురుగులను ఎప్పటికప్పుడు తొలగించాలి.

* క్యారెట్, బీట్‌రూట్ వంటి దుంపకూరలను లోతుగా ఉండే బాక్సుల్లో నాటాలి. పాలకూర, కొత్తిమీర వంటి ఆకు కూరలకు గింజలను టబ్‌లలో చల్లాలి.

* టొమాటో, బఠాణి, కీరదోస వంటి వాటికి నిలువుగా ఉన్న కంటెయినర్‌లను వాడాలి. తీగ జాతి చెట్లకు కాయలు కిందకు వేళ్లాడుతాయి. అవి నేలకు తగలకుండా ఉండడానికే ఈ ఏర్పాటు.

No comments:

Post a Comment