Wednesday, November 19, 2014

టొమాటో పులావ్


 
 కావలసినవి:
 సన్నబియ్యం - 250 గ్రా; టొమాటోలు - 100 గ్రా; ఉల్లిపాయ - 1; పుదీనా ఆకులు - 1/4 కప్పు; పచ్చిమిర్చి - 4; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి లేదా డాల్డా - టేబుల్ స్పూన్; ఏలకులు - 3; లవంగాలు - 5; దాల్చినచెక్క - చిన్నముక్క; షాజీరా- 1/2 టీ స్పూన్; ఉప్పు - తగినంత.
 
 తయారి:
 బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. టొమాటోలు చిన్న ముక్కలుగా తరిగి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడిచేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి మెత్తబడ్డాక పుదీనా ఆకులు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి. టొమాటో ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు కలుపుకుని ఈ పోపులో పోయాలి. అంటే పాత బియ్యమైతే గ్లాసుతో బియ్యం కొలుచుకుని ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోయాలి. అప్పుడు అన్నం పూర్తిగా ఉడికి మెత్తగా కాకుండా ఉంటుంది. కొత్త బియ్యమైతే నీళ్లు తగ్గించాలి. అదే నీళ్లలో తగినంత ఉప్పు వేయాలి. టమాట నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లలో నానిన బియ్యం వడగట్టివేసి ఉడికించాలి. అన్నం ఉడికి, నీరంతా ఇరిగిపోయాక మంట పూర్తిగా తగ్గించి, నిదానంగా మరో ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ఈ పులావ్‌ని పిల్లలకు లంచ్ బాక్స్‌లో, ప్రయాణాలలో పులిహోరకు బదులుగా చేసుకుని తీసుకెళ్లొచ్చు. కుర్మా లాంటి కూర లేదా పెరుగుపచ్చడితో సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment