Wednesday, November 19, 2014

మేతి ఇడ్లీ


కావల్సిన పదార్థాలు: బియ్యం: 1cup కొబ్బరి తురుము: 1cup మెంతులు: 1tbsp పెరుగు: 4tbsp బెల్లం: 3tbsp ఉప్పు: రుచికి సరిపడా 


తయారుచేయు విధానం: 1. ముందుగా ఒక గిన్నెలో బియ్యం వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి 6గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని రాత్రిల్లో నానబెట్టుకొంటే మరింత మంచిది. తర్వాత రోజు పిండి మొత్తగా రుబ్బుకోవడానికి సులభం అవుతుంది.
 2. మరో గిన్నె తీసుకొని అందులో కొద్దిగా పెరుగులో మెంతులను వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసి బియ్యం లాగే వీటిని కూడా రాత్రంత నానబెట్టుకోవలి. కనీసం 6 గంటల సేపు నానాలి. 
3. బియ్యం, మెంతులు నానిన తర్వాత మిక్సీ జార్ లో మెంతులను వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మొంతి పేస్ట్ ను తీసి పక్కన పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు అదే జార్ లో బియ్యం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేస్తుండగానే అందులో కొబ్బరి తురుము వేసి, స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. 
5. తర్వాత అందులో బెల్లం కూడా వేయాలి. 
6. మొత్తం మిశ్రమాన్ని గరిటతో బాగా మిక్స్ చేయాలి. ఇలా పిండి తయారుచేసుకొన్నాక, రుబ్బుకొన్ని పిండిని రాత్రంతా అలాగే ఉడనివ్వాలి.
 7. తర్వాత రోజు ఉదయం, ఇడ్లీపిండిలో, మేంతి పేస్ట్, ఉప్ప వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ లో పిండిని పోయాలి.
 8. ఇడ్లీ కుక్కర్ ను స్టౌ మీద పెట్టి మీడియం మంట మీద, ఆవిరి మీద ఇడ్లీలను 10నిముషాలు ఉడికించుకోవాలి . స్టీమర్ నుండి ఆవిరి ఒత్తిడి భయటకు వచ్చినప్పుడు, ఇడ్లీ కుక్కర్ మూత తీసి, స్పూన్ సహాయంతో ఇడ్లీలను సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవాలి. అంతే తినడానికి మేతి ఇడ్లీ రెడీ.ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా గార్లిక్ చట్నీతో సర్వ్ చేయాలి .

టొమాటో పులావ్


 
 కావలసినవి:
 సన్నబియ్యం - 250 గ్రా; టొమాటోలు - 100 గ్రా; ఉల్లిపాయ - 1; పుదీనా ఆకులు - 1/4 కప్పు; పచ్చిమిర్చి - 4; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి లేదా డాల్డా - టేబుల్ స్పూన్; ఏలకులు - 3; లవంగాలు - 5; దాల్చినచెక్క - చిన్నముక్క; షాజీరా- 1/2 టీ స్పూన్; ఉప్పు - తగినంత.
 
 తయారి:
 బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. టొమాటోలు చిన్న ముక్కలుగా తరిగి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడిచేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి మెత్తబడ్డాక పుదీనా ఆకులు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి. టొమాటో ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు కలుపుకుని ఈ పోపులో పోయాలి. అంటే పాత బియ్యమైతే గ్లాసుతో బియ్యం కొలుచుకుని ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోయాలి. అప్పుడు అన్నం పూర్తిగా ఉడికి మెత్తగా కాకుండా ఉంటుంది. కొత్త బియ్యమైతే నీళ్లు తగ్గించాలి. అదే నీళ్లలో తగినంత ఉప్పు వేయాలి. టమాట నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లలో నానిన బియ్యం వడగట్టివేసి ఉడికించాలి. అన్నం ఉడికి, నీరంతా ఇరిగిపోయాక మంట పూర్తిగా తగ్గించి, నిదానంగా మరో ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ఈ పులావ్‌ని పిల్లలకు లంచ్ బాక్స్‌లో, ప్రయాణాలలో పులిహోరకు బదులుగా చేసుకుని తీసుకెళ్లొచ్చు. కుర్మా లాంటి కూర లేదా పెరుగుపచ్చడితో సర్వ్ చేయాలి.

వినాయక చవితి పత్ర పూజ ...వినాయక పత్రిలో ఔషధగుణాలు

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. 

1. మాచీ పత్రం/మాచ పత్రి 

ఓం సముఖాయ నమః
 మాచీపత్రం పూజయామి

 మాచీ పత్రం : తెలుగులో దీనిని మాచ పత్రి అంటారు. చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. ఇవి దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కంటి సంబంధ, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి.

మాచిపత్రి ఒక రకమైన మందుమొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా వల్గారిస్ (Artemesia vulgaris). ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది.మాచీ పత్రి మాఛిపత్రి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు ఒకట వది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Artemisia.vulgaris.
ఈ పత్రి యొక్క ఔశధ గుణాలు :
  1. ఈ ఆకుని పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే త్వరగా వ్యాధి నివారణ అవుతుంది.
  2. వాత రోగాలు
  3. ఇది నేత్ర సంబంధ రోగాలకు అద్భుత నివారిణి. మాచీ పత్రాన్ని నీళ్లలో తడిపి కళ్లకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి.


2. దూర్వా పత్రం/గరిక 
 ఓం గజాననాయ నమ :
 దూర్వాయుగ్మం పూజయామి

 దూర్వా యుగ్మం : దూర్వా యుగ్మం అంటే గరిక. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అనే రకాలున్నాయి. ఇది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శ మొలలను నివారిస్తుంది.


గరిక పోచలు ఆకుపచ్చని రంగులో పొట్టిగా ఉండి 2-15 సెం.మీ. పొడవుండి అంచులు గరుకుగా ఉంటాయి. ఒక్కొక్క కొమ్మ సుమారు 1-30 సెం.మీ. పొడుగ్గా పెరుగుతాయి. వీటి కాండం చదునుగా ఉంటుంది. కాండం చివర విత్తనాలు 2–6 గుత్తులుగా ఉంటాయి. వీటికి లోతైన వేర్లు ఉంటాయి, కరువు పరిస్థితులలో 2 మీటర్ల లోతుకు పోయి ఒక చాపలాగా తయారుచేస్తాయి. ఇవి విత్తనాల ద్వారా వ్యాప్తిచెందుతుంది.

ఈ పత్రి యొక్క ఔశధ గుణాలు :

గరిక మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుందని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది.

గరిక ఆయుర్వేదంలొ నత్తికి,శ్వాస,చర్మ సంబంధిత రోగాలకు వాడతారు.గరిక పచ్చడి కూడా కొన్ని ప్రాంతాల్లొ తినే ఆచారం ఉంది.

కొన్ని వందల వ్రేళ్ళతొ,అతి తొందరగా పెరిగె గరిక గొప్పతనం చెప్పడం కష్టతరమని,దానిలొ దేవతలు ఉంటారని,దాని స్పర్శ పాపాలను హరిస్తుందని,దుస్స్వప్నాలను నాశనం చేస్తుందని ఈ శ్లొకం.

సహస్రపరమా దేవి శతమూల శతాంకుర
సర్వగుం హరతుమె పాపం దూర్వా దుస్స్వప్ననాశిని.

పీడకల వస్తే తరువాతి రోజు ఉదయం తలార స్నానం చేసి ఒక్క గరిక పొచను వినాయకునికి సమర్పించి పై శ్లొకం చెప్తూ గరికను తలమీద పెట్టుకుంటే పీడకల ఫలించకుండా ఉంటుంది.

ఈ గరికను వినాయకునికి సమర్పించడం చేత జాతకంలొ ఉన్న బుధగ్రహ దోషాలు తొలగిపొతాయి.

5,14,23 తేదిల్లొ పుట్టిన వారి అధిపతి బుధుడు.అలాగే గణిత,అకౌంట్స్ రంగాల్లొ ఉద్యొగం చెస్తున్నవారికి బుధ గ్రహానుగ్రహం తప్పనిసరి.

విద్యార్థులు అందరూ రోజు గణపతిని గరికతొ పూజించడం చేత ఙ్ఞాపక శక్తి పెరుగుతుంది.


3. అపామార్గ పత్రం/ఉత్తరేణి 
ఓం గుహాగ్రజాయనమః
 అపామార్గ పత్రం పూజయామి

 అపామార్గ పత్రం : తెలుగులో ఉత్తరేణి అంటారు. గింజలు సన్నటి ముళ్లను కలిగి ఉంటాయి. ఇది దంత ధావనానికి,  పిప్పి పన్ను, చెవిపోటు, రక్తం కారటం, అర్శమొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్లను నివారించడానికి ఉపయోగపడుతుంది.


పురాణ కథ

ఇంద్రుడు వృత్తాసురుని చంపిన తరువాత నముచి అనే రాక్షసుని చంపడానికి అతనితో కపట స్నేహం చేస్తాడు. నముచి విశ్రాంతి తీసుకొంటుండగా ఇంద్రుడు అతని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుని తరుముకొస్తుంది. దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగము చేసి నముచి తల బారినుండి తప్పించుకుంటాడు. ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం. ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు, నముచికి కనబడడు. అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపామార్గం సార్ధకనామం అయింది.వినియక చవితి పూజల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటి.సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్‌ ఆస్పరా.

ఈ పత్రి యొక్క ఔశధ గుణాలు :


  1. ఉత్తరేణి ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
  2. భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
  3. ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
  4. అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
  5. అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
  6. ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
  7. ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
  8. అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
  9. మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంధి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  10. ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
  11. నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.

4. బృహతీ పత్రం/ములక
ఓం గణాధిపాయనమః
 బృహతీ పత్రం పూజయామి

 బృహతీ పత్రం : దీనిని ములక, వాకుడాకు అంటారు. ఇవి వంగ ఆకుల మాదిరి, తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర, నేత్ర వ్యాధులను నయం చేస్తుంది. దంత ధావనానికి కూడా ఉపయోగిస్తారు.




ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
  1. దీనిని నీళ్ళలో కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ళనొప్పు లు ఉన్న చోట కట్టుకడితే.. ఉపశమనం కలుగుతుంది.
  2. బృహతీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది.
  3. బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది.
  4. ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది దీనిని నీళ్ళలో కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ళనొప్పు లు ఉన్న చోట కట్టుకడితే.. ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వేడి గడ్డలపెై ఈ మిశ్రమాన్ని కట్టుకడితే.. త్వరగా తగ్గిపోతాయి, దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
  • 1.ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది
  • 2.ఈ ప‌త్రాలు లేదా కాయలు శ్వాస‌కోశ వ్యాధుల‌కు విరుగుడుగా ప‌ని చే్స్తాయి.
  • 3.గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.


 5. దత్తూర పత్రం/ఉమ్మెత్త 
 ఓం హరసూనవే నమః
 దత్తూర పత్రం పూజయామి

 దత్తూర పత్రం : దత్తూర అంటే ఉమ్మెత్త మొక్క. ఇది సెగ గడ్డలు, స్తనవాపు, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, పేను కొరుకుడు, నొప్పులు, రుతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి.


ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు

  • వ్యాధిగ్రస్తునికి శిరోముం డనం చేయించి ఈ ఆకుల రసాన్ని రెండు నెల లపాటు రోజూ మర్ధన చేస్తే వ్యాధి తగ్గుతుంది.
  • ఆస్తమాను తగ్గిస్తుంది
  • ఊపిరిదిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది
  • మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భు తంగా పనిచేస్తుంది. 

6. తులసీ పత్రం/తులసి/కశ్యపాయ పత్రం
ఓం గజకర్ణాయనమః
 తులసీ పత్రం పూజయామి

 తులసీ పత్రం : హిందువులు దేవతార్చనలో వీటిని విధిగా వాడతారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలను తగ్గిస్తుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

తులసి (ఆంగ్లం Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసిఅనీ,
 కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. 
వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేదఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. 

షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉన్నది.
నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు.
పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. 


 7. బిల్వ పత్రం/మారేడు 
ఓం ఉమాపుత్రాయ నమ:
 బిల్వ పత్రం పూజయామి

 బిల్వ పత్రం : బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా కూడా లభ్యమవుతాయి. ఇవి శివుడికి ఇష్టమైనవి. మహాలక్ష్మికి కూడా ఇష్టమైనవని చెబుతారు. ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది.


8. బదరీ పత్రం/రేగు 
ఓం లంబోదరాయ నమః
 బదరీ పత్రం పూజయామి

 బదరీ పత్రం : బదరీ పత్రం అంటే రేగు ఆకు. ఇందులో రేగు, జిట్రేగు, గంగరేగు అనే మూడు రకాలున్నాయి. జీర్ణకోశ, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.



9. చూత పత్రం/మామిడి 
  ఓంఏకదంతాయ నమః 
 చూతపత్రం పూజయామి
  చూత పత్రం : అంటే మామిడి ఆకు. ఈ ఆకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. వీటిని వాడని హైందవ గృహాలు ఎక్కడా ఉండవు. ఇది రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతుంది.
 

10. కరవీర పత్రం/గన్నేరు 
ఓం వికటాయ నమః
 కరవీర పత్రం పూజయామి

 కరవీర పత్రం : దీనినే గన్నేరు అంటారు. దీని పువ్వులు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ పువ్వులకు పూజల్లో విశిష్ట స్థానం ఉంది. ఇది కణుతులు, తేలు కాట్లు, విషకీటకాల కాట్లు, దురద, కంటి సంబంధ, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది
.



11. మరువక పత్రం/ధవనం , మరువం
ఓం పాలచంద్రాయ నమః
 మరువక పత్రం పూజయామి

 మరువక పత్రం : ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా సువాసన వెదజల్లటం దీని ప్రత్యేకత. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జట్టు రాలటం, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.


 12. శమీ పత్రం/జమ్మి 
ఓం ఇభవక్త్రాయ నమః
శమీపత్రం పూజయామి



13. విష్ణుక్రాంత పత్రం/ 
ఓం భిన్నదంతాయ నమః
 విష్ణుక్రాంత పత్రం పూజయామి

 విష్ణుక్రాంత పత్రం : ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.


14. సింధువార పత్రం/వావిలి 
ఓం హేరంభాయ నమః
 సింధువార పత్రం పూజయామి

 సింధువార పత్రం : వీటినే వావిలి అంటారు. ఇవి జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్చ వ్యాధి, ప్రసవం అనంతరం వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి.

15. అశ్వత్థ పత్రం/రావి
ఓం వినాయకాయ నమః
 అశ్వత్థ పత్రం పూజయామి

 అశ్వత్థ పత్రం : రావి ఆకులను అశ్వత్థ పత్రాలంటారు. ఇవి మల బద్ధకం, కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, నోటిపూత, చర్మవ్యాధులను నివారిస్తాయి. జీర్ణశక్తిని, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి.

 16. దాడిమీ పత్రం/దానిమ్మ
 ఓం వటవే నమః
 దాడిమీ పత్రం పూజయామి

 దాడిమీ పత్రం : దాడిమీ అంటే దానిమ్మ మొక్క. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫల నైవేద్యం ఎంతో ఇష్టం. అతిసారం, విరేచనాలు, దగ్గు, కామెర్లు, అర్శమొలలు, ముక్కు నుంచి రక్తం కారటం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది.

 17. జాజి పత్రం/జాజిమల్లి 
ఓం శూర్పకర్ణాయ నమః
జాజీ పత్రం పూజయామి

 జాజి పత్రం : ఇది సన్న జాజిగా పిలవబడే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయ వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది.

18. అర్జున పత్రం/మద్ది 
ఓం సురసేవితాయ నమః
 అర్జున పత్రం పూజయామి

 అర్జున పత్రం : తెల్ల మద్దిచెట్టు ఆకులనుఅర్జున పత్రాలంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. ఇది అడవులలో పెరిగే పెద్ద వృక్షం. చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు బాగా పనిచేస్తుంది.

19.దేవదారు పత్రం 
ఓం సర్వేశ్వరాయ నమ:
 దేవదారు పత్రం పూజయామి

 దేవదారు పత్రం : దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. దీని మానుతో చెక్కే విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులు, కంటి వ్యాధులను తగ్గిస్తుంది.

20. గండలీ పత్రం/లతాదూర్వా /గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) 
ఓం సురాగ్రజాయ నమః
 గండకీ పత్రం పూజయామి

 గండకీ పత్రం : దీనిని లతా దూర్వా, దేవకాంచనం అంటారు. మూర్ఛ, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులి పురుగులను నివారిస్తుంది. దీని ఆకులను ఆహారంగా కూడా వినియోగిస్తారు.

21. అర్క పత్రం/జిల్లేడు.
ఓం కపిలాయ నమః 
 అర్కపత్రం పూజయామి।




పత్రి పూజ పరమార్థం

సృష్టిలో అన్ని వైద్య విధానాలకూ ఆయుర్వేదం తల్లిలాటిదని అంటూంటారు. కానే కాదు, అదంతా ట్రాష్ అంటారు వెంఠనే మరికొందరు సృష్టి మొదలైనప్పట్నుంచీ అన్నిరకాల వైద్యవిధానాలకూ ఆయుర్వేదమే ‘తల్లి’లాటిదనడంలో సందేహం లేదు. సిద్ధవైద్యం, యునాని వైద్యం, హోమియో వైద్యం, అల్లోపతి వైద్యం- అన్నిటికీ ఆయుర్వేదమే ఆధారమని చెప్పక తప్పదు. అసలు మన భారతదేశమే పుణ్యభూమి. ప్రతి యుగంలోనూ, అనుక్షణమూ సంభవించే పండుగల్లో, పబ్బాల్లో నిర్దేశించిన పూజా విధుల్లో, ఆహారపు విషయాల్లో- ప్రతి అంశంలోనూ ఏదో ఒక నిగూఢమైన అంశం ఇమిడి ఉంటుంది. ఆధ్యాత్మికమంటే గిట్టినా, గిట్టక పోయినా, ఆ పేరుతో చెబితే జనాలకు భయం, భక్తి అంటూనైనా ఆచరిస్తారనీ మన పెద్దలు ఆశించారు. ఈ పూజలూ, పునస్కారాల వెనక ఎంతో సైన్సు దాగి ఉంది. సైన్సుకందనిది ఆధ్యాత్మికం. కానీ ఆధ్యాత్మికానికి అందనిదేదీ లేదు.
వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి ‘మతం’ అంటే ‘మానవత్వా’న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త’మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి.
అసలు ప్రాచీన భారతంలో ఇలానే పూజ ఎందుకు చేయాలని నిర్దేశించి ఉంటారో కొద్దిగా ఆలోచించండి. కొత్త మట్టి ఎక్కడ దొరుకుతుంది? భాద్రపద మాసం అంటే, అపుడే వానలు బాగా వచ్చి ఉండటంవల్ల గ్రామాల, పట్టణాల్లో ఉండే చెరువులు, నదులు కొత్త నీటితో, కొత్తమట్టితో నిండుగా ఉంటాయి. వానలవల్ల నీరు చేరితే మంచిదే. కానీ దానితోబాటు మట్టికూడా పేరుకునిపోతే నదుల్లో, చెరువుల్లో పరిస్థితేంటి? కాబట్టి పూడిక తీయడం రైటు. ఈ పూడిక తీయడంతో వచ్చే బంకమట్టితో చక్కగా వినాయకుడి ప్రతిమలు చేయడంవల్ల, దానికి 21 రకాల పత్రులతో 9 రోజులు పూజ చేయడంవల్ల మరో ప్రయోజనం ఉంది. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ’ రహస్యం. నేడు సైన్సు అనే వాళ్ళంతా ‘ఎకో-ఫ్రెండ్లీ’అంటూ ఎనె్నన్నో ‘తంతులు’ నిర్వహించనారంభించారు. ఐతే, ఇది భారతీయులకు కొత్తేమీ కాదు. వేద కాలంనించీ ‘పర్యావరణ పరిరక్షణ’అనేది మనకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిర్దేశించారు. మనం ఏమిచేసినా శ్రద్ధగా, నిష్టగా చేయడమే ముఖ్యం. అదే ఆధ్యాత్మిక రహస్యం. శ్రద్ధతో, నిష్టగా మనం ఏ పనిచేసినా, దానిలో మనకు విజయం తథ్యం. సంక్రాంతికి ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెట్టినా, దీపావళికి మతాబాలు కాల్చినా కూడా ఆ సంబరాల వెనక ఎంతో సైన్సు ఉంది. వాటి గురించి మరోసారి చర్చిద్దాం. కానీ ప్రస్తుతం వినాయక చవితిలో మనం చేసే పత్రి పూజ గురించి ప్రస్తావిద్దాం. ఈ ప్రతి పూజలో 21 రకాల ఆకులున్నాయి. ఆకులు ఎందుకు ఎంచుకొన్నారూ? అంటే, మనకు అనాదిగా ఋషిపరంపర ఓషధులను, మూలికలను పూజాద్రవ్యాలుగా, యజ్ఞయాగాది కార్యక్రమాల్లో సమిధలుగా కొన్ని ఆకులను, మూలికలనూ, సమిధలనూ ప్రస్తావించారు. వీటి వెనక ఉన్నదంతా సైనే్స.
వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వీటి పేర్లు, శాస్ర్తియ నామాలతోబాటు వ్యావహారికంగా తెలుగులో పేర్లు పట్టికలో చూడవచ్చు.
కొన్ని పూజా విధానాల్లో భృంగరాజపత్రం, మాలతీ పత్రం, కేతకీ పత్రం, అగస్త్య పత్రం- వీటి ప్రస్తావన కూడా ఉంది.
మాచీ పత్రం లేదా మాచిపత్రిని సంస్కృతంలో శుక బర్హ, శుక పుష్ప అనీ, స్థౌణీయకా అనీ పిలుస్తారు. ఇది త్రిదోషహారి. దుర్గంధాన్ని తొలగిస్తుంది. క్రిమిహారి కూడా.
వినాయకుని పత్రి పూజలో మాచీపత్ర రహస్యాన్ని మొదటి నామంలోనే ఇమిడ్చారు మన ఋషులు. సుముఖాయనమః - అంటూ మాచీపత్రం సమర్పయామి అంటాం. సుముఖం అంటే చక్కటి ముఖం. ముఖం అంటే పెదాలు, దంతాలు, చిగుళ్ళు, నాలుక, కంఠము, అంగిలి, నోరు- ఇలా ఏడు భాగాలు కల్గింది కదా! అలాటి ముఖంనించి వచ్చే దుర్గంధాన్ని హరించి సుఖాన్నిచ్చేదే మాచీ పత్రం.
బృహదీ పత్రం అనే దాన్ని సంస్కృతంలో కంటకారి, మహతీ, కులీ, వార్తకీ- ఇలా పలురకాలుగా పిలుస్తారు. తెలుగులో ‘ములక’ అంటాం. ఈ ఆకు వంకాయ ఆకులా ఉంటుంది. తెల్లని చారలతో ఉంటుంది. దీని పండ్లు పసుపుపచ్చగా బంగారు రంగులోని ముళ్ళతో ఉంటాయి. ఇది శ్వాస, కాస వ్యాధుల్లో విశేషంగా గుణాన్నిస్తుంది.
బిల్వపత్రాన్ని సంస్కృతంలో శ్రీ్ఫల, శాండిల్య, మాతార, శైలూష అని పిలుస్తారు. మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఏక బిల్వం అంటే ఒకే పత్రం మూడుగా చీలి ఉంటుందన్నమాట. మూడు దళాలూ ఒకే మూలాన్నుంచి వచ్చినట్లే, త్రిగుణాలు (సత్వ, రజ, తమోగుణాలు) కూడా ఒకే మూలాన్నుంచి వస్తాయి. త్రిమూర్తులు ‘ఒక్కటే’ రూపమనీ సూచిస్తుంది. ఈ బిల్వం అనేది మధుమేహంలో (ఆకు, బెరడు) ఔషధంగా వాడతారు. ఇది రక్తాన్ని శుద్ధిచేస్తుంది. దీని పండ్లు బంగారు రంగులో వుంటుంది. లోపలి గుజ్జు మంచి వాసనలు వెదజల్లుతూంటుంది. అందులో బంగారు రంగులో తేనె లాటి ద్రవం ఉంటుంది. ఈ గుజ్జును రక్తశుద్ధికీ, మలబద్ధకాన్ని తొలగించడానికీ వాడతారు.
దూర్వాయుగ్మం అంటే గరిక (లేదా గడ్డి). ఈ గడ్డి మూడు రకాలు: శే్వతదూర్వా, నీలదూర్వా, గండదూర్వా. ‘గండ దూర్వా’నే గండాలి అంటారు. శే్వత (తెల్ల)గరికనే శతవీర్యా అంటారు. నీల దూర్వా లేదా నల్ల గరికనే సహస్రవీర్యా అంటారు. శే్వత గరికనీ నల్లగరికనీ కలిపి దూర్వాద్వయం అని (ఆయుర్వేద వైద్యశాస్త్రంలో) అంటారు. దూర్వాయుగ్మం అంటే రెండు ఆకులు/ దళాలు కల్గినవి అని అర్థం. ఇవి దాహం, చర్మ రోగం, చుండ్రు- వీటి నివారణకు వాడతారు. చెడ్డ కలలు వచ్చినపుడు మూత్ర విసర్జనలాటి సమస్యలను నివారిస్తుంది గరిక.
దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు. దీనే్న కనక, ఉన్మత్త, శివప్రియ అని సంస్కృతంలో వ్యవహరిస్తారు. ఇది వంకాయ జాతికి చెందిందే. ఉన్మాద లక్షణాలుండటంవల్ల దీనికి ఉన్మత్త అనీ పేరు. ఉన్మత్త కాస్త ఉమ్మెత్త అయ్యింది. ఇది జ్వరాన్ని, కుష్ఠు, కృమి తగ్గించడానికి, పుండ్లు మానడానికి, నొప్పి/ వేదన తగ్గించడానికీ పనికొస్తుంది. శ్వాస, కాస వ్యాధులనీ తగ్గించే ప్రత్యేక ఔషధంగా కూడా ఉమ్మెత్తను వాడతారు. విష ప్రభావాన్ని శరీరమంతా వ్యాపించకుండా నిరోధించే విశేష గుణం ఉమ్మెత్తది.
బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకు అజప్రియ, కోల, ఫేనిల, ఉభయ కంటక అనీ వ్యవహరిస్తారు. దీని గుండ్రని ఆకులు, ముళ్ళు చూడటానికి అందంగా ఉంటాయి కూడా. భోజనం తర్వాత ప్రతిరోజూ బదరీ ఫలం అంటే రేగుపండ్లు గనక తింటే, మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణవౌతుంది. అంతేకాదు. లంబోదరం- పొట్ట పెరగడం తగ్గుతుంది. (అందుకే ఆరో మంత్రం లంబోదరాయనమః బదరీ పత్రం సమర్పయామి అని ఉంటుంది గమనించండి).
అపామార్గ పత్రం అనేది ఉత్తరేణి చెట్టు ఆకు. ఉత్తరేణి చెట్టు వేరు ఉత్తర దిశగా వ్యాపించి ఉంటుంది. దీనే్న ఖరయాజరి, శిఖరి, ప్రత్యేక పుష్టి అని సంస్కృతంలో అంటారు. అధర్వణ వేదంలో దీని గురించి చాలా చక్కగా వర్ణన ఉంది. దీని విత్తనాలతో పాయసం చేసి సేవిస్తే, చాలాకాలంపాటు ఆకలి ఉండదని అంటారు. ఇది కడుపునొప్పి, చర్ది, శ్వాస వ్యాధుల నివారణకు విశేషంగా పనిచేస్తుంది. ‘అతి ఆకలి’నీ నివారిస్తుంది.
తులసీ పత్రం- అంటే తులసి ఆకు. తులసికే సురసా, సులుభ, బహుమంజరి, వృందా దేవదుంధుభి అని సంస్కృతంలో పేర్లున్నాయి. తులసీ తీర్థం ఎంత పవిత్ర స్థానాన్ని కల్గిందో వేరే చెప్పనక్కర్లేదు. తులసి ఇంట్లో ఉంటే విష పురుగులు దరిచేరవు. ఇది మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఇది ‘గజకర్ణ’మనే చర్మవ్యాధి నివారణకు దివ్యౌషధం (8వ మంత్రమూ అదే- గజకర్ణాయనమః తులసీ పత్రం సమర్పయామి).
చూతపత్రం అంటే మామిడి ఆకు. దీనే్న సంస్కృతంలో శుకప్రియ, వసంతదూత అంటారు. మామిడి ఇంట్లోని దుష్టశక్తులని (నెగటివ్ ఎనర్జీ) తొలగిస్తుంది. దీని గాలి సోకడంవల్ల, ఆరోగ్యం బాగుంటుంది. అతి మూత్రవ్యాధికి మామిడి చక్కని ఔషధం. మామిడి చిగుళ్ళు చక్కని కంఠ స్వరాన్నిస్తాయి. మామిడి ‘జీడి’వాడితే ‘పేను కొరుకుడు’వ్యాధిని తొలగించుకోవచ్చు. గుండెల్లో మంట, వాంతులు, అతిసారం- వీటి నివారణలో ‘మామిడి’కి ఎంతో పేరు ఉంది.
కరవీరపత్రం అంటే గనే్నరు ఆకు. దీనే్న సంస్కృతంలో గౌరీపుష్ప అనీ, గణేశ కుసుమ, చండీ కుసుమ అనీ అంటారు. హరప్రియ, అశ్వమారక, హయ మారక అనీ కూడా అంటారు. గనే్నరు పాలు మొండి పుండ్లను మానే్పయగలదు. వాపులనీ, గడ్డలనీ పోగొడ్తుంది. తేలుకాటుకు దీని పాలు ఎంతో ప్రశస్తమైన ఔషధం.
విష్ణుక్రాంత పత్రం అంటే సంస్కృతంలో శంఖపుష్టి, సుపుత్ర, అపరాజిత అనే పేర్లు కల్గి ఉన్నాయి. దీని పూలు నీలిరంగులో ఉంటాయి. ఇది మంచి దృష్టినీ, కంఠస్వరాన్నీ, జ్ఞాపక శక్తినీ ఇస్తుంది. మూత్ర దోషాలను తొలగించడంలో, కుష్టువ్యాధిలో కూడా దీన్ని వాడతారు.
దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు. దీనే్న దంత బీజ, రక్తపుష్ప అనీ అంటారు. ఇది అజీర్ణాన్ని పోగొడ్తుంది. వాంతుల నివారణలో, జలుబును తగ్గించడంలో బాగా వినియోగిస్తుంది. ఆకలి లేని వారికి దానిమ్మ తింటే చక్కగా ఆకలి వేస్తుంది.
దేవదారు పత్రం అనే దాన్ని సంస్కృతంలో సాల, భూతహారి, దేవకాష్ట అనీ అంటారు. ఇది హిమాలయాల్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఈ చెట్టు మానుతో విగ్రహాలు కూడా చెక్కుతారు. దీన్నించి తీసే పైన్ ఆయిల్ రంగుల పరిశ్రమలో వాడతారు. ఈ పైన్ ఆయిల్ కీళ్ళనొప్పుల్ని నివారిస్తుంది.
మరువక పత్రానికి ధవనం, మరువకం అనే పేర్లూ ఉన్నాయి. ఈ మరువం ఎండిపోయినా దాని సుగంధాన్ని ‘మరువం’. ఇది పురుగులను పారద్రోలుతుంది. దుర్గంధాన్ని తొలగిస్తుంది. ఇది ‘విషహారి’గా కూడా పేరుపొందింది.
సింధువార పత్రం అనేది తెలుగు లోగిలిలోని వావిలి చెట్టు ఆకు. వాత రోగానికి వావిలి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ వావిలి ఆకులను పొగ వేస్తే దోమలు పోతాయి.
జాజి పత్రం లేదా సన్నజాజి ఆకును సంధ్యాపుష్పి అని సంస్కృతంలో వ్యవహరిస్తారు. దీని పూలనుంచి తీసే సుగంధ తైలాన్ని తలనొప్పి నివారణకీ, చెవిపోటు నివారణకీ వాడతారు.
గండలీ పత్రం అనేది 17వ పత్రంగా వినాయక పూజలో చెబుతాం. దీనికే లతాదూర్వా అనీ సర్పాక్షి అనీ అంటారు. ఇది జ్వరాన్ని తగ్గించడానికి, దాహం తగ్గించడానికి బాగా వినియోగిస్తుంది.
శమీ పత్రమనేది తెలుగులో జమ్మి చెట్టు ఆకు. శమీవృక్షం, లక్ష్మి, సక్త్ఫుల అని సంస్కృత నామాలున్నాయి. విజయదశమి అంటే మనకు గుర్తొచ్చేది శమీవృక్షమే. దీని పండ్లలో ఉండే గుజ్జు, దీని కషాయం త్రిదోష జన్యమైన వ్యాధులను తొలగిస్తాయి.
అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఆకు. బోధితరు, పిప్పల, యాజ్ఞీక అని సంస్కృతంలో దీన్ని పిలుస్తారు. ఇది స్ర్తిసంబంధ వ్యాధులను నివారించడంలో మహత్తర ఔషధం.
అర్జున పత్రం అంటే మద్ది చెట్టు ఆకు. ఇది అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. సాధారణంగా దీన్ని ఇళ్ళ నిర్మాణంలో ఎక్కువగా వాడతారు. మర్రి ఆకుల్లా ఉంటాయి దీని ఆకులు. ఇది రక్తదోషాన్నీ, టీబీ లాటి వ్యాధుల్లో, గుండెకు సంబంధించిన రోగాల్లో ఎక్కువగా వాడతారు.
జిల్లేడునే ‘అర్క’అంటారు. జిల్లేడు ఎర్రని, తెల్లని పూలతో రెండు రకాలుగా వుంటుంది. వీటిలో తెల్ల జిల్లేడు ప్రశస్తం. దీని ఆకుల నించి తీసిన రసాన్ని పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. దీని పూలు శ్వాసకోశ విరుగుడుగా పనిచేస్తుంది. దీని పూలు శ్వాసకోశ వ్యాధుల్లో, దీని పాలు నపుంసకత్వ నివారణలో, పుండ్లను మాన్పడానికి వినియోగిస్తారు.
ఐతే, మనం ఈ 21 పత్రాల గురించీ, వాటి విశేష గుణాల గురించీ ఎపుడూ పట్టించుకోం. అసలు పత్రిలో 21 రకాలలో ఎన్ని మనకు దొరుకుతున్నాయో కూడా తెలీదు. ఏది ఏ ఆకో మనకు వద్దేవద్దు. మార్కెట్లో ‘‘పత్రి’’పేరుతో క్రోటన్ ఆకులు సైతం ఇచ్చేస్తారు. మనం తెచ్చేస్తాం. పూజ కానిస్తాం. ఇదీ మన తీరు. జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి క్రోటన్ ఆకుల పూజవల్ల ఎంత ప్రమాదమో! ఏదో దేవదారు, మద్ది తప్ప మిగిలినవన్నీ మన ఇళ్ళచుట్టూ ఉండే చెట్లే. అంచేత ఈసారి వినాయకుని పత్రి పూజ ఎలాచేయాలో మీరే నిర్ణయించుకోండి. ఇది భక్తి, ఆడంబరాలకోసం కాదు. మన ఆరోగ్యంకోసం అనేది గుర్తుంచుకొని మరీ చేయండి!
===
21 పత్రాల శాస్ర్తియ నామాలు
పత్రి పేర్లు శాస్ర్తియ నామాలు తెలుగు పేర్లు
మాచీ పత్రం Artemisia.vulgaris మాఛిపత్రి
బృహతీపత్రం Solanum.indicum బృహతీపత్రం (ములక)
బిల్వపత్రం Aegle.marmelos భిల్వం (మారేడు)
దూర్వాయుగ్మం cyandon.Dactylon (శే్వత) గరిక
cyandon.linearis (నీల)
దత్తూర పత్రం Datura.stramonium ఉమ్మెత్త
బదరీపత్రం Zizyphus.jujuba గంగరేగ (రేగు)
అపామార్గపత్రం Achyranthes.Aspera ఉత్తరేణి
తులసి పత్రం Ocimum Sanctum తులసి
చూతపత్రం Mangifera.Indica మామిడి
పత్రి పేర్లు శాస్ర్తియ నామాలు తెలుగు పేర్లు
కరవీర పత్రం Nerium.Odorum గనే్నరు
విష్ణుక్రాంత పత్రం Evolvulus.Alsinoides అపరాజిత
దాడిమి పత్రం Punica.Granatum దానిమ్మ
దేవదారుపత్రం Cedrus.Deodara దేవదారు
మరువక పత్రం Origanum.Majorana మరువం
సింధువారపత్రం Vitex.Negundo సింధువారం (వావిలా)
జాజి పత్రం Jasminum.Auriculatum జాజి
గండలీ పత్రం Cynodon.Dactylon సర్పాక్షి
శమీ పత్రం Prosopic.spicigera జమ్మి
అశ్వత్థ ఫత్రం Ficus.Religiosa రావి
అర్జున ఫత్రం Terminalia.Arjuna మద్ది
ఆర్క పత్రం Pterocarpus.Santalinus జిల్లేడు