Thursday, June 5, 2014

గోంగూరతో పులిహోర

గోంగూరతో పులిహోర
వెల్లుల్లిఁ బెట్టి పొగిచిన
పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా
మొల్లముగ నూని వేసుక
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా
ఆంధ్రమాత గోంగూర అంటే నోరూరని తెలుగు వాడు ఉంటాడా? వెల్లుల్లితో పోపు పెట్టిన గోంగూర పచ్చడి లేనిదే ముద్ద దిగని వారెందరో. మరి ఈసారి వెరయిటీగా గోంగూరతో పులిహోర చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం.
కావలసిన వస్తువులు:
బియ్యం – 200 gms
గోంగూర – 2 కప్పులు
ఎండుమిరపకాయలు – 8
ఆవాలు – 1 tsp
జీలకర్ర – 1 tsp
మెంతులు – 1/4 tsp
మినప్పప్పు – 1 tsp
శనగపప్పు – 1 tsp
నువ్వులు – 1 tbsp
వేరుశనగపప్పు – 3 tbsp
కరివేపాకు – 2 రెబ్బలు
పసుపు – 1/2 tsp
ఉప్పు – తగినంత
నూనె – 4 tbsp
ఇంగువ – చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు – 8 – 10
బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి, పొడిపొడిగా ఉండేట్టు వండి చల్లారనివ్వాలి. గోంగూర ఆకులన్నీ దూసి కడిగి ఆరనివ్వాలి. ప్యాన్ లో 3 ఎండుమిరపకాయలు, 1/2 tsp జీలకర్ర, నువ్వులు, 1/2 tsp ఆవాలు, మెంతులు  కాస్త రంగు మారేవరకు వేయించి తీసిపెట్టి చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీలో బరకగా పొడి చేసుకోవాలి. అదే ప్యాన్ లో ఒక చెంచాడు నూనె వేసి శుభ్రం చేసిన గోంగూర ఆకులు వేసి నిదానంగా తడి పోయేవరకు వేయించి మగ్గనివ్వాలి. ఇంతకుముందు చేసిపెట్టుకున్న పొడిలో ఈ మగ్గబెట్టిన ఆకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టి మిగిలిన నూనె వేడి చేయాలి. ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు,జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు,కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి, కొద్దిగా వేగిన తర్వాత  గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ముద్దను ఇందులో వేసి బాగా కలిపి దింపేయాలి. చల్లారిన అన్నంలో తగినంత ఉప్పు , ఈ పోపు కలపాలి. అన్నమంతా బాగా కలియబెట్టి కనీసం అరగంట అలా వదిలేయాలి. బాగా ఊరిన గోంగూర పులిహోర ఘుమఘుమలాడుతూ ఉంటుంది. కావాలంటే పోపులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అదో రుచి..

No comments:

Post a Comment