Thursday, June 5, 2014

అటుకులతో పులిహోర

అటుకులతో పులిహోర
అప్పుడప్పుడు కాస్త వెరయిటీ వంటకాల ప్రయోగాలు చేస్తుండాలి. ఇవాళ అటుకుల సంగతి చూద్దాం.అటుకులతో ఎక్కువగా మిక్చర్, ఉప్మాలాంటివి చేసుకుంటాము. అదే అటుకులతో పులిహోర కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయ, చింతపండు పులుసుతో కూడా అన్నం మాదిరిగానే అటుకుల పులిహోర చేసుకోవచ్చు.
కావలసిన వస్తువులు
అటుకులు – 200 gm
చింతపండు -  50 gm
పసుపు -  1 tsp
ఎండు మిర్చి -  4
ఆవాలు -  1 tsp
జీలకర్ర  – 1/2tsp
మినప్పప్పు -  1 tsp
శనగపప్పు – 2 tsp
వేరుశన గుళ్ళు -  1/4 కప్పు
కరివేపాకు -  2 రెబ్బలు
ఇంగువ  – చిటికెడు
నూనె  – 4 tbsp
ఉప్పు తగినంత
చింతపండును అర కప్పు నీళ్ళు పోసి నాన పెట్టి చిక్కటి పులుసు తీసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు,కరివేపాకు పసుపు వేసి వేయించి పులుసు పోయాలి. తగినంత ఉప్పు కొద్దిగా బెల్లం కాని చక్కెర కాని వేసి మరిగించాలి. పులుసు చిక్కబడి నూనె తేలగానే దింపేయాలి.   పులుసు ఎక్కువ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుని కావల్సినప్పుడు అన్నం వండి కలుపు కోవచ్చు. ఇప్పుడు అటుకులను నీళ్లలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసి నీరంతా పిండేయాలి. ఈ పులిహోరకు లావు అటుకులు తీసుకోవాలి. సన్న అటుకులు ఐతే ముద్దముద్దగా అవుతుంది. నీరంతా పిండేసిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వేసి దానికి తగినంత పులుసు వేసి బాగా కలియబెట్టి పదినిమిషాల తర్వాత  ఏదైనా పచ్చడి, ఆవకాయతో సర్వ్ చేయాలి.  ఇది చాలా త్వరగా తయారవుతుంది. ఇక పులుసు చేసి రెడీగా ఉంటే నిమిషాలమీద పులిహోర రెడీ.. ఇదే విధంగా సేమ్యాతో కూడా చేసుకోవచ్చు.

No comments:

Post a Comment