Thursday, June 5, 2014

రవ్వతో పులిహోర

రవ్వతో పులిహోర
పులిహోర అన్నంతోనే చేయాలా? లేకపోతే అది పులిహోర కాదంటారా? అబ్బే!! పులిహోర అన్నం తో కాకుండా ఉప్మారవ్వ, సేమ్యా, గోధుమరవ్వ, బియ్యంనూక, అటుకులు వగైరా వాటితో కూడా చేసుకోవచ్చు. వెరయిటీగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉప్మారవ్వ లేదా బొంబాయి రవ్వతో పులిహోర చేసే విధానం తెలుసుకుందాం.  కొంచెం జాగ్రత్తగా చేస్తే అన్నంలాగే పొడి పొడిగా రవ్వ పులిహోర చేసుకోవచ్చు.
కావలసిన వస్తువులు :
బొంబాయి/ఉప్మా రవ్వ – 1 గ్లాసు
నిమ్మకాయ – 1
ఎండుమిరపకాయలు – 3
ఆవాలు – 1/4 tsp
జీలకర్ర – 1/4 tsp
మినప్పప్పు – 1 tsp
కరివేపాకు – 2 రెబ్బలు
పసుపు – 1/4 tsp
ఉప్పు – తగినంత
నెయ్యి – 2 tbsp
నూనె – 3 tbsp
వెడల్పాటి ప్యాన్ లో ఒక చెంచాడు నెయ్యి వేడిచేసి చిన్న మంటపై రవ్వను కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి.  రవ్వను తీసి పక్కన పెట్టి అదే ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కరివేపాకు,   వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించాలి. ఇందులో పసుపు వేసి గ్లాసుడు నీళ్లు పోసి  తగినంత ఉప్పువేసి మరిగించాలి. మంట తగ్గించి మరుగుతున్న నీళ్లలో రవ్వ మెల్లిగా పొస్తూ ఉండలు కట్టకుండా కలుపుతో ఉండాలి. మూతపెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తరవాత గరిటతో మొత్తం రవ్వను పొడిపొడిగా చేయాలి. నీళ్లు ఎక్కువగా పోస్తే మెత్తగా ఉప్మాలా అవుతుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తపడితే చాలు. ఇందులో నిమ్మరసం పిండి, కొంచెం కొత్తిమిర, నెయ్యివేసి బాగా కలిపి పదినిమిషాల తరవాత వడ్డించాలి.  ఇదే విధంగా గోధుమ రవ్వతో కూడా ప్రయత్నించండి.

No comments:

Post a Comment