Thursday, June 12, 2014

ఉసిరితో పచ్చళ్ళు, చ్యవన్‌ ప్రాశ్‌, జామ్‌, జ్యూస్‌, తలకు రాసుకునేందుకు తైలం, వక్కపొడి


సంపూర్ణ ఆరోగ్యసిరి ఉసిరి

మానవజాతికి ప్రకతి ప్రసాదించిన గొప్పవరం ఉసిరి. ఉసిరి స్వాంతన, శాంతం చేకూర్చి జీవిత కాలాన్ని పెంచే దివ్యౌషధం. చర్మసంబంధ వ్యాధులను నివారించటంలో ఎంతో ఉపయోగపడే షేతవీర్య అధిక పాళ్ళలో ఉంది. పిత్తను తగ్గించే గుణం ఉండటం వలన చర్మవ్యాధులను అదుపులో ఉంచుతుంది.ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకొంటే శరీరం మెరవటమే కాక ముడతలు మాయమవుతాయి. జుట్టు నిగారింపు మెరగవుతుంది.బాలనెరుపు, చుండ్రును నివారిస్తుంది. కంటి చూపును మెరుగు పరచటమేకాక కళ్ళు ఎరుపెక్కటం, కంటిలో దురద, నీళ్ళుకారటాన్ని నివారిస్తుంది.

రక్తంలో చక్కెర శాతాన్ని పెరగకుండా సమపాళ్లలో ఉంచుతుంది. దంతాలను గట్టిపరచి దంతక్షయాన్ని నివారిస్తుంది.ఉసిరిలో విటమిన్‌ సిఅధికంగా ఉన్నందువల్ల అనేక ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.ఉసిరితో పచ్చళ్ళు, చ్యవన్‌ ప్రాశ్‌, జామ్‌, జ్యూస్‌, తలకు రాసుకునేందుకు తైలం, వక్కపొడి లాంటి నిల్వపదార్థాలను కూడా తయారు చేయవచ్చు. అవేమిటో ఈరోజు రుచిలో తెలుసుకుందామా!

చ్యవన్‌ప్రాశ్‌
కావలసిన పదార్థాలు

ఉసిరికాయలు : 15-18
చక్కెర : 1 కప్పు లేదా రుచికి తగినంత
నెయ్యిలేదా స్వచ్ఛమైన వెన్న : 5,6 టేబుల్‌స్పూన్లు
యాలుకలు : 5-6
జీలకర్ర : 2 టీ స్పూన్లు
నల్ల మిరియాలు : 2 టీస్పూన్లు
తయారుచేయు విధానం
ముందుగా కుక్కర్‌లో అరకప్పునీటిలో ఉసిరికాయలను వేసి ఒక విజిల్‌ వచ్చేవరకు స్టౌవ్‌ మీద ఉంచాలి. ఉడికిన ఉసిరికాయలను గింజలు తీసిమెత్తగా చేసుకోవాలి. నీరు ఉంటే పిండివేయాలి. వెడల్పాటి మూత ఉన్న పాత్రను స్టౌ మీద పెట్టి వేడయ్యాక నెయ్యి వేడిచేసి పిండిన ఉసిరి ముద్దను 5-6 నిమిషాలు కలియపెట్టి తడిపోయేంతవరకు ఇగరనివ్వాలి. ఇగిరిన మిశ్రమానికి చక్కెర వేసి కలియబెట్టాలి. చక్కెర వేసి కలుపుతుండగా లోపలి మిశ్రమము కొద్దిగా విడిపోతుంది. తిరిగి మిశ్రమం కలిసే వరకు అంచులకు అంటకుండా కలియబెడుతుండాలి.

ఇప్పుడు జీలకర్ర పొడి, యాలుకల పొడి, మిరియాల పొడిని వేసి బాగా కలిపి స్టౌమీద నుండి దించి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని సీసాలోకి తీసుకుని నిల్వచేసుకోవాలి. చ్యవన్‌ప్రాశ్‌ను అలాగే లేదా పాలతో కలుపుకొని తీసుకోవచ్చు. చక్కెర ఇష్టం లేనివారు తేనెను కలుపుకోవచ్చు. కాని చ్యవన్‌ప్రాశ్‌ చల్లపడిన తరువాతే తేనె కలుపుకోవాలి.ఈ ఉసిరి చ్యవన్‌ప్రాశ్‌ రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది.

పండ్లరసం
కావలసిన పదార్థాలు

ఉసిరి కాయలు : 10
చక్కెర : 5 టీ స్పూన్లు
తయారుచేయు విధానం
ముందుగా గింజలు తీసివేసిన ఉసిరికాయలను ముక్కలుగా చేసి 1 లేదా 2 గ్లాసుల నీళ్ళు పోసి మిక్సీలో బాగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఇష్టాన్ని బట్టి చక్కెరకాని, ఉప్పుకాని, తేనెకాని కలుపుకొని తాగాలి.
ఉపయోగాలు
మధుమేహం ఉన్నవారు చక్కెర లేకుండా తాగితే మందులా పనిచేస్తుంది. మలబద్దకాన్ని నిరోధిస్తుంది. మంచి జీర్ణశక్తినిస్తుంది. వేడి నుండి శరీరానికి ఉపశమనం కలిగిస్తూ చల్లగా ఉంచుతుంది.

2వ పద్ధతికి కావలసిన పదార్థాలు
ఉసిరి ముక్కలు : 1 కప్పు
మంచి నీరు : గ్లాసు
మిరియాల పొడి : 2 స్పూన్లు
తేనె, ఉప్పు : రుచికి తగినంత
తయారుచేయు విధానం 
మిక్సీలో 1 గ్లాసుచల్లటి నీరు పోసి అందులోఉసిరి ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి బట్ట ద్వారా ఒక గ్లాసులోకి వడకట్టి అందులో చక్కెర లేదా తేనె, ఉప్పు కలుపుకొని తాగవచ్చు. చల్లగా కావాలనుకొనేవారు ఐస్‌ముక్కలతో, లేదా ఫ్రిజ్‌లో రసాన్ని ఉంచి చల్లబరచి తాగవచ్చు.

జామ్‌

కావలసిన పదార్థాలు

ఉసిరికాయ ముక్కలు : 1 కప్పు
చక్కెర : 1 కప్పు
యాలుకల పొడి : 1 టీ స్పూన్‌
తయారుచేయు విధానం
స్టీలు పాత్రలో పావుకప్పు నీరుపోసి స్టౌ మీద వుంచి మరగనిచ్చి చక్కెరవేసి కలపాలి. కరిగిన మిశ్రమంలో ఉసిరి కాయముక్కలు, యాలుకల పొడివేసి కొద్దిగా గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. మిశ్రమంలో కొద్దిగా నీటి తడి మిగిలినపుడు స్టౌ మీద నుండి దింపి మిశ్రమాన్ని చల్లగా అయ్యేంతవరకు ఉంచాలి. చేతికి అంటేలా ఉన్న ఈ జామ్‌ను ఒక గాజుసీసాలో భద్రపరచుకోవాలి.
ఉదయాన్నే ఒక స్పూన్‌ జామ్‌ను ఒక గ్లాసు నీటితోపాటు తీసుకొంటే ఆరోగ్యకరం.
ఉసిరిపులిహోర
కావలసిన పదార్థాలు

బియ్యం : 1/2 కప్పు
కొబ్బరి తురుము : 1/4 కప్పు
గింజలు లేని ఉసిరి కాయలు : 3-4
పచ్చిమిరప కాయలు : 2-3
ఎండు మిరపకాయలు 3
సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు
ఆవాలు 2 టీ స్పూన్‌లు
వేయించిన శనగపప్పు 1/2 కప్పు
మినపప్పు 2 టీస్పూన్‌
పసుపు 
కొత్తిమీర 1/2 కప్పు
ఉప్పు
ఇంగువ
తయారుచేయు విధానం
అన్నం వండి చల్లారనివ్వాలి. ఉసిరి, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలను మెత్తగా నూరుకోవాలి. కొద్దిగా నీరుపోసి ఉప్పు కలుపుకోవాలి. గిన్నె తీసు కొని అందులో 3 స్పూన్ల నూనెను వేసి కాగిన తరువాత ఎండు మిరపకాయలు, ఆవాలు, ఇంగువ, మినపప్పు, వేరుశనగపప్పు సన్నటి సెగపై కలియబెడుతూ వేయించుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి దోర రంగు వచ్చే వరకు వేయించి ఉసిరి మిశ్రమాన్ని కలిపి కొద్దిసేపు ఉంచాలి. ఇందులో పసుపు, ఉప్పువేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని వండి ఉంచిన అన్నంలో కలిపి తరిగిన కొత్తిమీరను పైన అలంకరించుకోవాలి.
ఉసిరిపొడి
ఉసిరికాయలను శుభ్రపరిచి ఆరనిచ్చిగింజలు తీయాలి. ముక్కలుగా చేసి ఎండలో బాగా ఎండిన తరువాత ఉసిరిముక్కల్ని గ్రైండ్‌ చేసి జల్లెడ పట్టుకోవాలి. మెత్తటి పొడిని తడిలేకుండా ఉన్న సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడి నీటిలో బాగా కరిగిపోతుంది.

ఉపయోగాలు
ఉసిరి పొడిని తీసుకోవడం వలన జీర్ణశక్తిని, ఆహార పదార్థాల రుచిని పెంచుతుంది. ఔషధంలా నీటిలో కలుపుకొని తాగవచ్చు. పచ్చళ్ళు, నిల్వ ఉండే పదార్థాలలో కలుపుకోవచ్చు. కేశసంరక్షణకు ఉపయోగించవచ్చు. నీటిలో కలిపి ఆ నీటితో కళ్ళు శుభ్రపరుచుకోవచ్చు.

తీపి వక్కపొడి
శుభ్రపరిచిన 1 కిలో ఉసిరికాయలను బాగా ఉడక నిచ్చి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. కిలో చక్కెరకు 1 కప్పు నీరు కలిపి, 1 టీ స్పూన్‌ యాలుకల పొడిని కలిపి ముదురు పాకం పట్టాలి. పాకంలో ఉసిరికాయ ముక్కలు వేసి 1 టీస్పూన్‌ యాసిటిక్‌ ఏసిడ్‌ వేసి బాగా కలియబెట్టి ఒక వారం పాటు నిల్వ వుంచాలి. 8వ రోజు పొడి బట్టతీసుకొని పాకాన్ని వడకట్టాలి. పైన ఉన్న ముక్కలను ఒక రోజు పూర్తిగా కప్పి ఉంచి తరువాత రోజు ముక్కలను 3-4 రోజుల పాటు ఎండపెట్టి బాగా ఎండిన తరువాత గాలిజొరబడని సీసాలో ఉంచుకోవాలి. ఇవి చాలా రోజుల పాటు నిల్వవుంటాయి. 

పచ్చడి
కావలసిన పదార్థాలు

ఉసిరి కాయలు : ఒక కిలో
చింతపండు : 250 గ్రా, కారం : 250 గ్రా.
ఉప్పు 300 గ్రా
ఆవ పిండి : (పచ్చివి ఎండనిచ్చి పొడి కొట్టాలి) 1/2 కప్పు
వెల్లుల్లి పాయలు : 50 గ్రా.
మెంతిపిండి : (వేయించి, వెల్లుల్లి పాయలతో కలిపి గ్రైండ్‌ చేయాలి) 5 టీ స్పూన్లు
నూనె : 500 గ్రా.
శనగపప్పు : 2 టీస్పూన్లు, ఎండుమిరప కాయలు : 7, 8
తయారుచేయు విధానం
బాణలిలో 100 గ్రా. నూనెలపోసి సన్నసెగతో కాయలు అన్నీ ఒకేసారి వేయించకుండా 2 లేదా 3 వేస్తూ కాయలన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. చింతపండు వేడినీళ్ళలో వేసి ఉడకనిచ్చి గింజలు, పిప్పి లేకుండా గుజ్జుతీయాలి. కాయలు వేయించిన బాణలిలో సరిపడా నూనె పోసి ఎండు మిరపకాయలు, శనగపప్పు వేయించి అందులో చింతపండు గుజ్జు వేసి చిక్కగా దగ్గరయ్యేంతవరకు వేయించి దింపాలి.మిగిలిన నూనె వేడి చేసి చల్లారనివ్వాలి. వేయించిన ఉసిరి కాయలకు పోపువేసిన చింత పండు గుజ్జు, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతి పిండి కలిపి చల్లారిన నూనెను పోసి జాడీలో ఉంచుకోవాలి.

No comments:

Post a Comment