Thursday, June 5, 2014

ఉసిరికాయ పులిహార

ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో విరివిగా దొరికే ఈ ఉసిరికాయలతో పచ్చడి, పప్పు, ఆవకాయ, పులిహోర చేసుకుంటారు.  పుల్ల పుల్లగా ఉండే ఉసిరికాయ పులిహార తయారీవిధానం తెలుసుకుందాం
కావలసిన వస్తువులు :
అన్నం – 1 గ్లాసు / 200 gms
ఉసిరికాయలు – 4
పసుపు – 1/4 tsp
పచ్చిమిరపకాయలు – 4
కరివేపాకు – 2 రెబ్బలు
ఆవాలు – 1/4 tsp
జీలకర్ర – 1/4 tsp
మినప్పప్పు – 1 tsp
ఇంగువ – చిటికెడు
కొత్తిమిర – 2 రెమ్మలు
ఉప్పు – తగినంత
నూనె – 3 tbsp
అన్నం మెత్తగా కాకుండా ప్రతి పలుకు విడివిడిగా ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో అన్నంలో తగిన ఉప్పు కలిపి చల్లారనివ్వండి. ఉసిరికాయలు కడిగి , తడి లేకుండా తుడిచి తురిమి పెట్టుకోవాలి. ప్యాన్ లో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక  నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, మినప్పప్పు వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు పసుపు, కరివేపాకు, ఉసిరికాయ తురుము వేసి నిమిషంపాటు వేయించి దింపి అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమిర కూడా కలిపి పది నిమిషాలు అట్టే పెట్టి సర్వ్ చేయాలి. పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు.

No comments:

Post a Comment