Wednesday, September 17, 2014

ఔషద మొక్కలు.. 3. వస ( "పిల్లలకి వస ఎప్పుడు పోయాలి" )

పల్లెల్లో దీనిని వజ అని కూడ పిలుస్తారు.  సంస్కృతంలో ‘వచు’ లేదా ‘ఉగ్రగంధ’ అంటారు. ఇది దుంప జాతి మొక్క. వరి పండించే అన్ని రకాల నేలలు దీనికి అనుకూలమే. దీని ఆకులు సుమారు ఒక అంగుళం మందం వుండి సుమారు ఒకటి.... రెండడుగుల పొడవు వుంటాయి. వస చెట్టు తేమగా ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది.

కూరగాయ తోటలకు పెట్టినట్టే దీనికి కూడ నీటి తడులివ్వాలి. తల్లి దుంపలకున్న చిన్న పిలక దుంపలతో దీనిని ప్రవర్థనం చేయ వచ్చు. నాటిన సుమారు పది నెలలకు దుంపలు తయారవుతాయి. 
తయారయిన దుంపలను త్రవ్వి తీసి దానికున్న కాండాని, చిన్న వేరులను తీసి వేసి, ఆ దుంపలను ముక్కలుగా చేసి ఎండ బెట్టి అమ్ముకోవచ్చు. 
వీటిని ఔషదాలు, సువాసన ద్రవ్వాలు, మొదలగు వాటిలో వాడతారు. ఆయుర్వేద మందుల దుఖాణాలలోకూడ దీనిని అమ్ము కోవచ్చు. 
గతంలో పల్లె ప్రజలు ఈ వజ కొమ్మును నీటితో నూరి చిన్న పిల్లలకు నాకించే వారు. దాంతో వారికి మాటలు తొందరగా వస్తాయని నమ్మే వారు.

సమతూకంగా వస పొయ్యకుండా ఎక్కువ పోస్తే గలగలా మాట్లాడతారు. దీని నుండి పుట్టినదే ఈ జాతీయము "వస పిట్టలాగ వాగు తున్నావె" ఎక్కువగా మాట్లాడె పిల్లలను .."మీ అమ్మ నీకు వజ చాల ఎక్కువగా పోసినట్టుంది" అంటుంటారు. అలాంటి వాళ్లని సంబోధించి వీడికి వసెక్కువ పోశారంటారు. శరీర వాపును కూడా ఈ వస చెట్టు వేళ్ల రసం తగ్గిస్తుందని ఆయుర్వేదంలో ఉంది.

పసితనంలో తొందరగా మాటలు రావడానికి వస కొమ్మును అరగదీసి తేనెతో కలిపి పోస్తారు. అలా పోస్తే మాటలు స్పష్టంగా, చక్కగా, త్వరగా వస్తాయి.


పిల్లలకి వస ఎప్పుడు పోయాలి

చిన్నపిల్లలకి వస పోస్తే మంచిదని ఇదివరకువారు పసిపిల్లలకి వస పోసేవారు.  అది ఎందుకు పోయాలో, ఎప్పుడు పోయాలా, ఎలా పోయాలో, ఏ వయసులో పోయాలో సంగతి అటుంచి  అసలు వస అంటే ఏమిటో, దాని ఉపయోగాలేమిటో ఈ కాలం తల్లులకు తెలియచేసే ఉద్దేశ్యమే ఇది.

వస ఏ ఆయుర్వేద మందులు తయారుచేసే పదార్ధాలుండే షాపులోనైనా దొరుకుతుంది.  దీనిని తీసుకొచ్చి గంధం తీసే సాన మీద 2, 3 చుక్కల నీరువేసి ఈ వసకొమ్ముని దానిమీద మూడుసార్లు తిప్పి దానిని పిల్లలకి నాకించాలి.

పిల్లలకి 4 – 6 నెలల మధ్య వస పోస్తే మంచిది.  దీనిని 2, 3 సార్లు పోస్తే చాలు.  వసపొయ్యటం ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యకూడదు.  దానికీ  సమయముంది.  ఆదివారంగానీ, బుధవారంగానీ వసపొయ్యాలి.  ఆదివారంనాడుపోస్తే ఆయుష్షు పెరుగుతుందనీ, బుధవారంనాడు పోస్తే మంచి బుధ్ధిమంతులూ, తెలివితేటలుకలవాళ్ళూ అవుతారని అంటారు.

వసవల్ల ఉపయోగాలు  ..  

పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతునేయున్నది

దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తరా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు. శాస్త్రీయంగా కూడా దీనిని పిల్లలలో ఉపయోగించడం వలన కపమును హరించి మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దీని ప్రభావం వలన నాలుక సంబంధమైన నాడులు చురుకుగా పనిచేస్తాయి. వస వేళ్ళను గొంతు వ్యాధులు, కడుపు నొప్పి, జ్వరం, మానసిక రుగ్మత, కాలేయం, రొమ్ము నొప్పుల నివారణలోను, మూత్రపిండ వ్యాధులలోను బొల్లి మచ్చల నివారణలో వాడతారు.

వోకల్ కార్డ్స్ ని శుభ్రపరుస్తుంది.  స్వరం చక్కగా వస్తుంది.  నాలుక మందంపోయి చక్కగా మాట్లాడతారు.  మేధో శక్తి పెంచుతుంది.  మెదడులో వుండే నరాలని ఉత్తేజపరుస్తుంది.  జీర్ణశక్తి పెంచుతుంది.  క్రిమి సంహారిణిగా కూడా పని చేస్తుంది.  పిల్లలు చురుకుగా చక్కగా పెరిగేటట్లు చేస్తుంది.

ఇన్ని ఉపయోగాలున్న వసని మీ బిడ్డలకూ ఇవ్వండి.  అయితే తగు మోతాదులో మాత్రమే ఇవ్వాలనే విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం )

No comments:

Post a Comment