Thursday, September 4, 2014

వడియాలకు కొన్ని టిప్స్‌

చల్లగా బయట వర్షం పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలని ఎవరికైనా ఉంటుంది. అయితే ఎండాకాలం ఎండల్లో ఎండబెట్టుకున్న వడియాలు వర్షాకాలంలో వేడిగా వేయించుకుని తింటుంటే ఆ రుచే వేరు. రసం, సాంబారుల్లోనూ వడియాలు కావలసిందే. సడెన్‌గా ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఒక్కోసారి వాళ్లకు స్నాక్స్‌లా కరకరలాడే ఈ వడియాలు వేయించిపెట్టి...వేడివేడిగా చాయ్‌ ఇచ్చినా వచ్చిన అతిథులు ఎంతో సంతోషంగా వెళతారు. మరి అలాంటి వడియాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అలాగే అప్పడాలు కూడా. మచ్చుకు కొన్ని ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం... 

కొన్ని టిప్స్‌
  • వడియాలకు ఉపయోగించే గుమ్మడికాయ ముదురుగా ఉంటే మంచిది. బూడిద గుమ్మడికాయ తరిగినప్పుడు గింజలు తీసేయండి. పక్షులు కానీ ఉడతలు కానీ ఈ గింజల కోసం వచ్చి వడియాలు పాడుచేస్తాయి. ముక్కలను ఒక పలుచని నూలు వస్త్రంలో వేసి బాగా మూట గట్టి, చేటలో లేదా చిల్లుల బుట్టలో పెట్టి పైన ఒక పళ్లెం పెట్టి దాని మీద పొత్రం లాంటి బరువు పెట్టాలి. గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ, పిండి తక్కువ ఉంటే, వడియాలు బాగా గుల్లగా వస్తాయి.
  • క్యాబేజీ, ఉల్లిపాయ, క్యారట్‌, బీట్‌రూట్‌, ఆలుగడ్డ... వీటితో కూడా ఇదే మాదిరిగా వడియాలు తయారుచేసుకోవచ్చు.
  • పొట్టుమినప్పప్పు వాడితే రుచి, ఆరోగ్యం కూడా. పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు.
  • పప్పు ఎక్కువగా నానబెట్టుకుంటేనే మంచిది. ఎక్కువైతే మిగిలిన పిండితో గారెలు వేసుకోవచ్చు. తక్కువైతే కష్టం కదా.
  • సువాసన కలిగిన ఇంగువ వాడితే బాగుంటుంది.
  • పప్పును ముందు రోజు నానబెట్టుకుంటే వడియాలు గుల్లగా వస్తాయి.
  • పప్పును మెత్తగా కాటుకలా రుబ్బాలి. పిండి పలుచగా ఉంటే వడియాలు పెట్టడానికి సరిగా రావు.
  • రెండు రోజులు బాగా ఎర్రటి ఎండలో వడియాలు బాగా ఎండిన తరువాత నెమ్మదిగా వస్త్రం నుండి వడియాలను వేరుచేయాలి.
  • వడియాలు ఎండితే క్లాత్‌ దగ్గరకు ముడుచుకుంటుంది. అందువల్ల వడియాలు ఉన్న వస్త్రాన్ని తిరగేసి కొద్దిగా నీళ్లు చల్లి తడిపి క్లాత్‌ను ఆ చివర, ఈ చివర పట్టి మెల్లగా లాగితే వడియాలు సులువుగా వస్తాయి.
  • బియ్యాన్ని నానబోసి, దంచి లేదా మిక్సీలో వేసి తయారుచేసిన పిండితో వడియాలు పెడితే వడియాలు రుచిగా ఉంటాయి. మిల్లులో ఆడించిన బియ్యప్పిండితో వడియాలు అంత బాగా రావు.

No comments:

Post a Comment