Tuesday, September 2, 2014

ఉగాది ప్రత్యేక వంటకాలు : ఉగాది పచ్చడి , బొబ్బట్లు, పులిహొర , మామిడికాయ పచ్చడి, మామిడి అన్నం , మామిడి కూర

ఉగాది పచ్చడి :

  • వేప పువ్వు చేదు కొరకు
  • పచ్చి మామిడికాయ వగరు కొరకు
  • చింతపండు పులుపు కొరకు
  • మిరపకాయ కారం కొరకు
  • బెల్లం మరియు అరటిపండు ముక్కలు తీపి కొరకు
  • ఉప్పు ఉప్పదనం కొరకు
ఈ ఆరు రకాల రుచులు కలిపి చేసే మిశ్రమాన్ని ఉగాది పచ్చడి అంటారు. ఈ ఆరు రకాల రుచులు కూడా మనజీవితంలో ప్రతీసారి మనల్ని కదిలిస్తాయి. అవి బాధగా, ఆనందంగా, కోపంగా, భయంగా, ఆశ్చర్యంగా మన జీవితం ఉండాలని కోరుకుంటూ మనం దీనిని సాంప్రదాయబద్దంగా చేసుకుంటాము.

కావలసిన పదార్థాలు :

  • బెల్లం - 2 టీస్పూన్స్
  • చింతపండు - 1 1/2 టీస్పూన్
  • మామిడికాయ ముక్కలు ( సన్నగా తరిగినటువంటివి )- 1 1/2 టీస్పూన్
  • వేప పువ్వులు - 1 టీస్పూన్
  • నీరు - 1 కప్పు

తయారుచేయు విదానం :

  • ఒక కప్పులో నీరు తీసుకొని దానిలో చింతపండు వేసి 15 - 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
  • దాని నుండి గింజలు వేరు చేసి చింతపండు రసం తీయాలి.
  • బెల్లాన్ని బాగా పొడిగా చేసి దానిలో కలియబెట్టాలి.
  • తరువాత దానిలో మామిడికాయ ముక్కలు మరియు వేప పువ్వులు వేసి కలపాలి.
దానిని దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని తరువాత ప్రతిఒక్కరు తప్పని సరిగా తినవలసిన ప్రసాదము ఈ ఉగాది పచ్చడి. ఉగాది పండుగ నాడు మొట్టమొదటగా తినవలసినదే ఈ ఉగాదిపచ్చడి.

బొబ్బట్లు :

ఉగాది పండుగ నాడు మన ఆంద్రప్రదేశ్ లో తప్పనిసరిగా చేసుకొనే పిండివంటకం బొబ్బట్లు. దీని మీద నెయ్యివేసుకొనిగాని, పాలలో నంచుకొని గాని తింటారు.

కావలసిన పదార్థాలు :

బొబ్బట్టు లోపల పెట్టుటకు :

  • పచ్చిపప్పు - 1 కప్పు
  • పంచదార / బెల్లం - 1 1/2 కప్పు
  • యాలుకలు - 8

పైన అద్దుటకు :

  • మైదాపిండి - 1/2 కప్పు
  • బియ్యపిండి - 1/2 కప్పు
  • నూనె - 1 కప్పు

తయారుచేయు విధానం :

  • పచ్చిపప్పును శుభ్రంగా కడిగి దానిని బాగా ఉడకపెట్టాలి.
  • మైదాపిండి, బియ్యపిండిని కొంచెం ఉప్పు వేసి నీటితో కలపాలి.
  • అ మిశ్రమంలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా పిండి మిశ్రమము మృదువుగా వచ్చే విధంగా కలపాలి.
  • ఆ మిశ్రమాన్ని 2 గంటలపాటు గాలి తగలకుండా ఉంచాలి.
  • తరువాత ఉడికిన పప్పును తీసుకొని దానిలో ఎమైనా నీరు ఉంటే తీసివేసి దానిలో బెల్లం వేసి బాగా కలపాలి. (మిక్సీలో వేయవలెను).
  • ఆ మిశ్రమాన్ని కొంచెం వేడి చేయవలెను.
  • ఆ మిశ్రమం చల్లారిన తరువాత దానిని 10,12 గుండ్రంగా వుండలు చేసుకొనవలెను.
  • మిదా పిండి మిశ్రమాన్ని తీసుకొని దానిని కూడా గుండ్రని వుండలుగ చేసుకొనవలెను.
  • ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానిపై కొంచెం నూనె రాసి ఆ మైదా పిండి వుండను తీసుకొని చేతితో వెడల్పుగా చేయవలెను.అంచుల వద్ద మందంగాను, మద్యలో పలుచగాను వుండే విధంగా చేయవలెను.
  • తరువాత దానిపై పప్పు బెల్లం కలిపిన మిశ్రమంతో చేసిన వుండను మద్యలో వుంచి మైదా పిండి అంచులతో దానిని కప్పివేయాలి.
  • అదే విధంగా అన్ని వుండలను చేయాలి.
  • తరువాత దానిని తీసుకొని చపాతిలాగా జాగ్రత్తగా వత్తాలి.
  • దానిని పెనంపై నూనెతో కాని, నెయ్యితో కాని కాల్చుకోవాలి.

పులిహొర:

కావలసిన పదార్థాలు:

  • బియ్యం - ఒకటిన్నర కప్పు
  • చింతపండు - తగినంత
  • పచ్చిమిరపకాయలు - 3(నిలువుగా తరగాలి)
  • కరివేపాకు
  • పచ్చిపప్పు - 1 టీస్పూన్
  • వేరుశనగగుళ్ళు - 1 కప్పు
  • జీడిపప్పు
  • ఎండుమిరపకాయలు - 4
  • పోపు గింజలు - 1/2 స్పూన్
  • అల్లం మిశ్రమం
  • నూనె - తగినంత
  • పసుపు - 1టీస్పూన్
  • ఇంగువ - తగినంత
  • ఉప్పు - తగినంత

తయారు చేయు విధానము:

  • మొట్టమొదట వండిన అన్నాన్ని ఒక పాత్రలోనికి తీసుకోవాలి.
  • తరువాత పొయ్యిమీద ఒక బాండీలో నూనె పోసి వేడిచేసి దానిలో పోపు గింజలు వేసి వాటిని వేయించిన తరువాత దానిలో జీలకర్ర,వేరుశనగగుళ్ళు,జీడిపప్పు,పచ్చిపప్పు,అల్లం మిశ్రమం,పచ్చిమిరపకాయలు,ఎండుమిరపకాయలు మరియు కరివేపాకు వేసి బాగా వేయించాలి.ఆ మిశ్రమం మొత్తాన్ని అన్నం ఉన్న పాత్రలోనికి వేయాలి.
  • మరల బాండీలో కొంచెం నూనె వేసి చింతపండు రసం వేయాలి,కొంచెం పసుపు,ఉప్పు,ఇంగువ వేసి బాగా కలియబెట్టి ఆ మిశ్రమాన్ని నూనె కలిసేవిదంగా తెరలనివ్వాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా అన్నం లో పోయాలి.
  • ఇప్పుడు ఆ పాత్రలో ఉన్న అన్నాన్ని బాగా కలియబెట్టాలి.కలిపిన తరువాత కొంచెం సమయం (చింతపండు మిశ్రమం పీల్చుకునేంత వారకు)మూతపెట్టాలి.

మామిడికాయ పచ్చడి :

3/4 కప్పు పచ్చడి చేయుటకు కావలసిన పదార్థాలు :

  • మామిడికాయ - 1
  • కారం - 1 లేదా 2 స్పూన్స్
  • పసుపు - 1/2 టీస్పూన్
  • వెల్లుల్లిపాయ - 1
  • కొత్తిమేర - 1 టీస్పూన్(తరిగినవి)
  • ఉప్పు - తగినంత

పచ్చడికి పోపు(తిరగమాత) పెట్టుకోవాలనుకుంటే క్రింది వస్తువులు కూడా కావలెను:

  • ఆవాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఇంగువ - కొంచెం (చిటెకెడు)
  • కరివేపాకు - కొంచెం

తయారుచేయు విధానం :

  • మామిడికాయను 1/2 అంగుళం ముక్కలుగా తరగాలి.
  • ఒక గిన్నెలో వెల్లుల్లిపాయ, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమేర వేసి బాగా కలియబెట్టాలి.
  • ఆ మిశ్రమాన్ని తీసి విడిగా వేరే గిన్నెలో పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కొంత మిశ్రమం తీసుకొని దానికి పోపు పెట్టుకోవాలి.
  • కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దానిలో కొంచెం ఇంగువ వేసి దానిని మామిడికాయ ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.

మామిడి అన్నం :

కావలసిన పదార్థాలు :

  • వేరుశెనగపప్పులు - 4 టేబుల్ స్పూన్స్
  • కరివేపాకు
  • బియ్యం - 150 గ్రాములు

మిశ్రమం తయారుచేయుటకు :

  • పసుపు - 1/2 టీస్పూన్
  • ఆవాలు - 1 1/2 టీస్పూన్
  • ఎండుమిరపకాయలు - 5
  • తురిమిన మామిడి - 1 1/2 కప్పు
  • కొబ్బరి తురిమినది - 4 టేబుల్ స్పూన్స్
  • ఇంగువ - 1/2 టీస్పూన్

పోపుకు కావల్సిన పదార్థాలు :

  • పచ్చిపప్పు - 1 టేబుల్ స్పూన్
  • ఎండుమెరపకాయ - 1
  • ఆవాలు - 1 టీస్పూన్
  • కరివేపాకు
  • నూనె - 3 టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం :

  • మొట్టమొదటగా అన్నాన్ని వండుకొని దానిని చల్లరపెట్టుకోవాలి.
  • మిశ్రమం చేయుట కొరకు అవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పసుపు మరియు తురిమిన కొబ్బరికి తీసుకొని బాగా కలపాలి.
  • తరువాత దానిలో సగం తురిమిన మామిడిని వేయాలి
  • దీని అంతటిని బాగా మిశ్రమంగా చేయాలి.
  • పోపు పెట్టుటకు ఒకపాత్రలో కొంచెం నూనె వేసి వేడిచేయవలెను.
  • దానిలో పచ్చిపప్పు, ఆవాలు, మిరపాక, కరివేపాకు వేయవలెను.
  • అవి బాగా వేగిన తరువాత దానిలో వేరుశెనగపప్పు వేసి వేయించవలెను.
  • అది బంగారు రంగులోకి వచ్చే విధంగా వేయించిన తరువాత మిగిలిన మామిడి తురుమును కూడా వేసి వేయించవలెను.
  • దానిని కొంచెం తక్కువ మంటపై వేడి చేయవలెను
  • దానిలో మనము తయారు చేసిన మిశ్రమాన్ని కలిపి దానిలో ఉన్న పచ్చి వాసన పోయేవరకు దానిని వేయించవలెను.
  • ఆ మిశ్రమం మొత్తాన్ని ఒక పాత్రలో తీసుకొని ఉంచండి.
  • చల్లారబెట్టిన అన్నాన్ని తీసుకొని దానిలో తగినంత ఉప్పు మరియు కరివేపాకులను కలిపాలి.
  • మిశ్రమాన్ని తీసుకొని ఆ అన్నంలో వేసి కలుపుకోవాలి.

మామిడి కూర :

కావలసిన పదార్థాలు :

  • జీలకర్ర - 1/2 టీస్పూన్
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • బెల్లం - 1 టేబుల్ స్పూన్
  • ఎండు మెరపకాయలు - 6
  • ఉప్పు - తగినంత
  • తురిమిన కొబ్బరి - 1/2 కప్పు
  • ఉల్లిపాయ - 2 తరిగినవి
  • మామిడికాయలు - 250 గ్రాములు
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • కొత్తిమేర - 1టీస్పూన్
  • పసుపు - 1/2 టీస్పూన్
  • అల్లం - 1 ముక్క

తయారుచేయు విధానం :

  • మామిడికాయల తొక్కు తీసుకొనవలెను.
  • లోపల ఉన్న టెంకెను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా చేయవలెను.
  • ఆ ముక్కల్ని కడిగి శుభ్రంగా చేసుకొనవలెను.
  • తరువాత కొబ్బరి, మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమేర మరియు జీలకర్ర తీసుకొని బాగా మిశ్రమం చేసుకోవలెను.
  • ఒక పాత్రలో నూనె తీసుకొని దానిలో ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా వేయించవలెను.
  • తరువాత దానిలో మనము తయారుచేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి వేయించవలెను.
  • దానిలో మామిడికాయ ముక్కల్ని మరియు బెల్లాన్ని వేసి బాగా కలిపి ఒకగ్లాసు నీరు పోయాలి.
  • దానిలో తగినంత ఉప్పు వేసుకొని తక్కువ మంటపై వుంచి కూరను తయారుచేసుకోవాలి.

No comments:

Post a Comment