Friday, July 4, 2014

అవకాడో ముక్కల పచ్చడి

అవకాడో ముక్కల పచ్చడి


అవకాడో గురించి ఎందుకు ఇంత శ్రమపడి వ్రాస్తున్నానని అనుకుంటున్నారా ! అవకాడో  కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది అంటారు. ఇంకా దానికి కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అందరికీ తెలుస్తుందని వ్రాస్తున్నాను.

మా ఇంట్లో అవకాడోతో(Avocado) ముక్కల  పచ్చడి అప్పుడప్పుడు చేసుకుంటాము. ఇంటావిడ చేస్తుంది కాబట్టి దానికి కొలతలూ గట్రా ఏమీ ఉండవు. ఆ రోజు తినే వాళ్ళ అదృష్టాన్ని బట్టి రుచులూ అవీ ఉంటాయి. నేను దానికి అలవాటు పడిపోయాను. ఈ మధ్య మా అమ్మాయి ఇంట్లో పచ్చడి రుచి చూసి, అది ఎల్లా చేస్తారో వ్రాయమని (కొలతలతో) నాకు రహస్యంగా ఇమెయిల్ పంపించింది. నేను చిన్న పరిశోధన లాంటిది చేసి సాధించాను. దీనిలో ఏమన్నా గొప్పదనం ఉంటే ఇంటావిడదే కానీ నాది కాదు అని ముందరగా చెప్పుకుంటున్నాను. ఇంకా వంటింట్లో నాకు పూర్తి కంట్రోల్ రాలేదు.

అవకాడోలు దాదాపు 80 రకాలలో వస్తాయి. వీటి జన్మస్థానం మెక్సికో దేశం. ఈ కాయలు ప్రపంచమంతా వ్యాపించినవి. అన్ని మార్కెట్లలో దొరుకుతాయో లేదో తెలియదు అమెరికాలో మాత్రం దాదాపు అంతటా దొరుకుతాయి. ఊరగాయ పెట్టుకునే మామిడి కాయ సైజు లో ఉంటాయి. 'Hass ' వెరైటీ అవకాడోలు సంవత్సరము పొడుగునా వస్తాయి. నేను వాటిని ఉపయోగించాను. కొంచెం ఆకు పచ్చగా ఉండి గట్టిగా ఉండేవి చూసి తీసుకుంటే ముక్కలు బాగా వస్తాయి. ముక్కలు రాక పోయినా గుజ్జు తో పచ్చడి బాగానే ఉంటుంది.

అవకాడోని నిలువుగా చుట్టూతా కత్తితో కొస్తే రెండు భాగాలుగా విడిపోతుంది. దానిలో టెంకని తీసివెయ్యాలి. ఒక స్పూన్ తో అంచులు చుట్టూతా కదిపితే గుజ్జు కొబ్బరి చిప్పలలా విడిపోయి వస్తాయి. వాటిని కత్తితో ముక్కలుగా కోయటమే. మెక్సికన్ లు వీటితో Guacamole  అనే పచ్చడి లాంటిది చేస్తారు. అది చేసే విథానం చూస్తే కాయ లోనుంచి గుజ్జు ఎల్లా తీయాలో తెలుస్తుంది.ఇక్కడ చూడండి.


ముక్కల పచ్చడికి కావలసిన పదార్ధాలు:

1. అవకాడో  - 1 (medium size)
2. నిమ్మకాయ ( lime ) - 1/2
3. పసుపు - చిటికెడు
4. కారం - 1/2 టీ స్పూన్
5. ఉప్పు - 1/2 టీ స్పూన్
6. మెంతి పొడి - 1/8 టీ స్పూన్ (మెంతులు వేయించి పిండి బడితే బాగుంటుంది)
7. నూనె (తిరగమోత కి)- 3/4 టేబుల్ స్పూన్
8. ఇంగువ - 4 షేకులు . మామూలుగా సీసాని షేక్ చేస్తాము.
9. తిరగమోత గింజలు: 1/4 స్పూన్ మినప్పప్పు, దానికి కొంచెం తక్కువగా జీలకర్ర, ఆవాలు, ఒక ఎండు మిరప కాయ

తయారుచేయు విధానము:

అవకాడో కోసి దానిలో గుజ్జు (రెండు కొబ్బరి చిప్పల మాదిరిగా వస్తుంది) ముక్కలు చేసి ఒక గిన్నె(bowl) లో వెయ్యండి. దానిమీద నిమ్మకాయ పిండండి. దాని మీద పసుపు, కారం, ఉప్పు, మెంతి పొడి వేసి కలపండి.

మీకు చిన్న బాగుణ (లేక తిరగమోత గిన్నె) ఉంటే దానిలో నూనె వెయ్యండి. స్టవ్ మీద మీడియమ్ లో ఉంచి మినప్పప్పు, మూడు మెంతి గింజలూ, జీలకర్ర, ఆవాలూ వరసగా వెయ్యండి. మినప్పప్పు వేగినట్లు కనపడగానే ఒక చిన్న ఎండు మెరప కాయ తుంచి ముక్కలు వెయ్యండి. ఇంగువ నాలుగు షేకులు వెయ్యండి. ఇంక తిరగమోతని స్టవ్ మీద నుంచి తీసి దంచటమో, బ్లెండ్ చెయ్యటమో చేసి అవకాడో ముక్కలున్న గిన్నె లో వేసి కలపండి. ఒక గంట అల్లా ఉంచిన తరువాత అవకాడో పచ్చడి తినటానికి రెడీ. అన్నంలో, దోశల్లో, బ్రెడ్ మీద బాగుంటుంది.

తిరగమోతని ఎప్పుడూ మాడ్చ కూడదు !!!..

No comments:

Post a Comment